me too: ‘మీ టూ’ ఉద్యమం ఎఫెక్ట్.. మరో నేతపై వేటు వేసిన బీజేపీ!
- బీజేపీ కార్యదర్శి సంజయ్ పై వేధింపుల ఆరోపణలు
- చర్యలు తీసుకోవాలని సొంత వర్గం నుంచే ఒత్తిడి
- బాధ్యతల నుంచి తప్పిస్తూ బీజేపీ హైకమాండ్ ఆదేశం
పనిప్రదేశంలో తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రముఖుల పేర్లను మహిళలు ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా బయటపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమం దెబ్బకు బాలీవుడ్ నటులు నానాపటేకర్, అలోక్ నాథ్ లు సినిమా ఆఫర్లను పోగొట్టుకోగా, దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ కీలక ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక భారత విదేశాంగ సహాయ మంత్రి, సీనియర్ జర్నలిస్ట్ ఎంజే అక్బర్ ఏకంగా పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా మీటూ ఉద్యమం దెబ్బకు బీజేపీలో రెండో వికెట్ పడింది.
ఉత్తరాఖండ్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంజయ్ కుమార్ ను బాధ్యతల నుంచి తప్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. కుమార్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళా బీజేపీ కార్యకర్త ఆరోపించిన నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఈ లైంగికవేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కుమార్ ను తప్పించాలని కోరుతూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. సొంత పార్టీ నేతలు కూడా సంజయ్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ మరింత నష్టపోకుండా బీజేపీ హైకమాండ్ తెలివిగా నిర్ణయం తీసుకుంది.