KTR: కారు ఆగొద్దు.. డ్రైవర్ మారొద్దు: మంత్రి కేటీఆర్
- డెబ్బై ఏళ్లలో దేశానికి ‘కాంగ్రెస్’ ఇచ్చింది మొండిచెయ్యే
- ప్రజల చెవుల్లో మోదీ పువ్వులు పెడుతున్నారు
- టీజేఎస్ గుర్తు ‘అగ్గిపెట్టె’.. పుల్లలు పెట్టే వాళ్ల గుర్తు ఇది
తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కే మళ్లీ పట్టం కట్టాలని మంత్రి కేటీఆర్ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిపల్లెలో ఈరోజు నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ జన సమితి పార్టీల గుర్తులపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాంగ్రెస్ పార్టీ గుర్తు ‘హస్తం’.. అంటే మొండిచెయ్యి అని, డెబ్బై ఏళ్లలో దేశానికి ఆ పార్టీ ఇచ్చింది ఈ మొండిచెయ్యిేనని విమర్శించారు. బీజేపీ గుర్తు కమలం అంటే పువ్వు అని, ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడం తప్ప మోదీ చేసిందేమీ లేదని సెటైర్లు విసిరారు. కోదండరామ్ సార్ పార్టీ.. తెలంగాణ జన సమితి గుర్తు ‘అగ్గిపెట్టె’ అని.. పుల్లలు పెట్టే వాళ్లకు ఇలాంటి గుర్తులే ఇస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరి, టీఆర్ఎస్ కు ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తు ‘కారు’ అని.. పేదలను, రైతులను, అక్కలను, చెల్లెళ్లను, తెలంగాణలోని సబ్బండ వర్నాల వారిని ఆ కారులో ఎక్కించుకుని నాలుగేళ్లుగా జోరుగా కేసీఆర్ నడుపుతున్నారని.. ‘కారు ఆగొద్దు - డ్రైవర్ మారొద్దు’ అంటూ తమ పార్టీకే మళ్లీ పగ్గాలు దక్కేలా చూడాలని ప్రజలను కేటీఆర్ కోరారు. హైదరాబాద్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రైలును తీసుకొస్తామని, తద్వారా పర్యాటకం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.