North Korea: ఇచ్చిన మాట తప్పిన అమెరికా... మళ్లీ అణ్వస్త్ర బాటన ఉత్తర కొరియా!
- ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి
- లేకుంటే అణు కార్యక్రమాలను ప్రారంభిస్తాం
- అమెరికాను హెచ్చరించిన ఉత్తర కొరియా విదేశాంగ శాఖ
అణ్వస్త్ర తయారీని ఆపేస్తామని మాటిచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మాట తప్పేలా ఉన్నారు. అమెరికాతో శాంతి చర్చలకు బై చెబుతూ, తాము మళ్లీ అణ్వస్త్రాల తయారీని ప్రారంభిస్తామని ఉత్తర కొరియా హెచ్చరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడం లేదని నార్త్ కొరియా ఆరోపిస్తోంది. ట్రంప్ తన మనసు మార్చుకుని, తమపై విధించిన తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను వెంటనే తొలగించకుంటే ఆణ్వస్త్రాలను తయారు చేస్తామని తెలిపింది.
ఉత్తర కొరియా విదేశాంగ శాఖను ఉటంకిస్తూ, అధికార వార్తా సంస్థ 'కేఎస్సీఏ' వెల్లడించిన వివరాల ప్రకారం, అణు, క్షిపణి పరీక్షలను ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఉత్తర కొరియా నిలిపివేసినా, అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు దేశాల మధ్యా శాంతి చర్చల్లో భాగంగా సింగపూర్ లో కిమ్, ట్రంప్ ల మధ్య చర్చలు సాగిన సంగతి తెలిసిందే. అమెరికాను నమ్మించేందుకు పంగ్యేరీ అణు కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలని కూడా కిమ్ ఆదేశించారు.
అయితే, అణు పరీక్షలను ఆపితే ఆంక్షలు తొలగిస్తామని చెప్పిన అమెరికా ఆ పని మాత్రం చేయలేదు. ఇప్పటికీ ఆంక్షలను ఎత్తివేసేందుకు అమెరికా నిరాకరిస్తుండటంతో, తీవ్ర అసహనంతో ఉన్న ట్రంప్, అమెరికా తీరు ఓ గ్యాంగ్ స్టర్ మాదిరిగా ఉందని విమర్శలు గుప్పించారు. ఆంక్షలు ఎత్తివేయకుంటే, అణు కార్యక్రమాలు తప్ప మరో మార్గం తమ ముందు లేదని స్పష్టం చేస్తున్నారు.