kollywood: ఇప్పటికి పేరు చెప్పలేను... ఆ హీరోను మాత్రం వదిలిపెట్టను: హీరోయిన్ అమైరా దస్తర్
- వేధింపుల గురించి మరిన్ని వివరాలు చెప్పిన అమైరా
- షూటింగ్ సమయంలో నరకం చూపించారు
- ఏదో ఒకరోజు అతని పేరు చెబుతానంటున్న అమైరా
దక్షిణాదిన ఓ ప్రముఖ హీరో అల్లుడు, యువ హీరో తనను వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన నటి అమైరా దస్తర్, తాజాగా ఓ పత్రికకను ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి మరిన్ని వివరాలు చెప్పుకొచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో హీరోతో సాంగ్ చేస్తుండగా, అనవసరంగా తనపై చెయ్యి వేసి ఇబ్బంది పెట్టాడని, ఆ విషయాన్ని దర్శకుడి దృష్టికి తీసుకెళితే, తనకు నరకం చూపించారని ఆరోపించింది.
ఉదయం ఎనిమిది గంటలకే షూటింగ్ కు పిలిచేవారని, తాను సిద్ధమై కార్వాన్ లో కూర్చుంటే ఎప్పటికీ పిలిచేవారు కాదని చెప్పింది. ఉదయం నుంచి కూర్చోబెట్టి సాయంత్రం ఓ ఐదు నిమిషాలు షూటింగ్ చేసి పేకప్ చెప్పేవారని, షూటింగ్ లేకుంటే తనకు విషయం చెప్పేవారు కాదని వెల్లడించింది. ఈ అనుభవంతో దక్షిణాది సినిమాలు చేయాలంటేనే భయం పట్టుకుందని చెప్పింది.
అయితే, ఈ విషయాలేవీ తన తల్లిదండ్రులకు చెప్పలేదని, ఆ హీరోకు దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి పలుకుబడి ఉందని, ఓ పెద్ద హీరోకి అల్లుడని చెప్పింది. అతని పేరును ఇప్పుడు తాను చెప్పలేనని, చెబితే తన కెరీర్ ని నాశనం చేస్తారని వాపోయింది. అయితే, ఏదో ఒకరోజు అతగాడి పేరు చెబుతానని, ఆ హీరోని మాత్రం వదలేది లేదని అంది.
కాగా, అమైరా దస్తర్, గతంలో ధనుష్ తో కలసి 'అనేగన్' అనే సినిమాలో (తెలుగులో అనేకుడు) నటించింది. ఆమె, చెబుతున్న వివరాలను బట్టి ధనుష్ పైనే ఆరోపణలు చేస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ సినిమా సమయంలోనే వేధింపులను ఎదుర్కొని ఉంటుందని పలువురు అంటున్నారు. హీరో ధనుష్, రజనీకాంత్ అల్లుడన్న సంగతి తెలిసిందే. ఇక తనను వేధించింది ఎవరన్న విషయాన్ని అమైరా స్వయంగా చెబితే తప్ప నిజం బయటకు రాదు.