Shashi Tharoor: మా నాయకుడు రాహుల్ గాంధీనే... కానీ, ఆయన ప్రధాని అభ్యర్థి కాకపోవచ్చు: శశిథరూర్
- ప్రధాని అభ్యర్థిపై మహాకూటమిలోని అన్ని పార్టీలు కలసి నిర్ణయం తీసుకుంటాయి
- కాంగ్రెస్ లోని ప్రతి ఒక్కరి ఛాయిస్ రాహుల్ గాంధీనే
- ఎన్నికలు సజావుగా జరిగితే.. కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి కాకపోవచ్చని ఆయన తెలిపారు. భావసారూప్యత ఉన్న పార్టీలతో కాంగ్రెస్ పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేయబోతోందని... ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంపై కూటమిలోని పార్టీలన్నీ కలసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న ఎంతో మంది గొప్ప నేతలు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరి ఛాయిస్ రాహుల్ గాంధీనే అని చెప్పారు.
ఎన్నికలు సజావుగా జరిగితే రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని శశి థరూర్ తెలిపారు. ప్రధాని మోదీని శివలింగంపై ఉన్న తేలుతో పోల్చిన విషయంపై ఆయన మాట్లాడుతూ, 'తెల్లటి మగ గుర్రంపై ఏమాత్రం కీర్తిలేని కత్తిని పట్టుకుని కూర్చున్న నాయకుడు మోదీ' అంటూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏక వ్యక్తి పాలనను మోదీ నడుపుతున్నారని మండిపడ్డారు. దేశ చరిత్రలోనే ఏకీకృత ప్రధాని కార్యాలయం ఇప్పుడు కొలువైందని విమర్శించారు. ప్రతి నిర్ణయాన్ని ప్రధాని కార్యాలయమే తీసుకుంటోందని, ప్రతి ఫైలు ఆమోదముద్ర కోసం ప్రధాని కార్యాలయానికే వెళుతోందని అన్నారు.