Telangana: ఇక మీ ఇష్టం... మహాకూటమి మిత్రుల విషయంలో చేతులెత్తేసిన కాంగ్రెస్!
- టీజేఎస్ కు 8, సీపీఐకి 3 మాత్రమే
- అంతకుమించి ఇవ్వలేము
- స్పష్టం చేస్తున్న కాంగ్రెస్ నేతలు
- నేడు మహాకూటమి కీలక చర్చలు
- కూటమిలో టీజేఎస్, సీపీఐ కొనసాగడంపై ఉత్కంఠ
మహాకూటమిలో భాగంగా ఉన్న టీజేఎస్, సీపీఐ పార్టీలకు వారు కోరినన్ని సీట్లు ఇచ్చే అవకాశాలు లేవని కాంగ్రెస్ పార్టీ కుండబద్దలు కొట్టింది. టీజేఎస్ 10 నుంచి 12 స్థానాలు, సీపీఐ 5 స్థానాలను డిమాండ్ చేస్తుండగా, టీజేఎస్ కు 8, సీపీఐకి 3 స్థానాలను మాత్రమే ఇవ్వగలమని తేల్చి చెప్పింది. కూటమిలో ఉండాలో, బయటకు వెళ్లాలో ఆ పార్టీ నేతల ఇష్టమని, ఈ విషయంలో తాము ఇంతకన్నా వదులుకునేది లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. నేడు మహాకూటమిలో కీలక చర్చలు ఓ రహస్య ప్రదేశంలో జరగనుండగా, పొత్తులపై తుది క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాంగ్రెస్ ఇస్తామన్న సీట్లతో సర్దుకుపోయేలా సీపీఐ కనిపించడం లేదు. మరోవైపు టీజేఎస్ సైతం తమకు అధిక సీట్లు కావాల్సిందేనని పట్టుబడుతుండగా, తెలుగుదేశం పార్టీ తొలుత 14 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించి, ఇప్పుడు మరో రెండు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కూటమిలో టీజేఎస్, సీపీఐ కొనసాగడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీపీఐ కూటమి నుంచి బయటకు వెళితే, టీజేఎస్ కు 9, టీడీపీకి 15 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.