Andhra Pradesh: దుర్గగుడిలో మొమెంటోల కుంభకోణం.. నలుగురిని సస్పెండ్ చేసిన ఈవో!
- విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు
- బెదిరింపులకు దిగిన ఏఈవో అచ్యుతరామయ్య
- వన్ టౌన్ పోలీసులకు ఈవో కోటేశ్వరమ్మ ఫిర్యాదు
విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో దసరా సందర్భంగా మొమెంటోల కొనుగోలు కుంభకోణంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఈవో కోటేశ్వరమ్మ ఈరోజు తెలిపారు. ఏఈవో అచ్యుతరామయ్యతో పాటు మరో ముగ్గురు ఉద్యోగులు ఈ కుట్రలో పాలుపంచుకున్నారని వెల్లడించారు. కేవలం 1,200 మొమెంటోలు కొనుగోలు చేసి ఆ సంఖ్యను 2,000గా చూపించడంతో వీరిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సస్పెన్షన్ పై వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు ఇచ్చామన్నారు.
క్రమశిక్షణ చర్యలు తీసుకున్నందుకు ఏఈవో అచ్యుత రామయ్య తనను బెదిరించాడని వాపోయారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తనను బెదిరించడంతో పాటు ఆలయ నిధులను, అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు నలుగురు నిందితులపై విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు.