Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై కీలక ఉత్తర్వులు జారీచేసిన సుప్రీంకోర్టు!
- ఏపీ ప్రభుత్వ అఫిడవిట్ పై సంతృప్తి
- జడ్జీలకు నివాసాలు ఏర్పాటు చేయాలని ఆదేశం
- జనవరికల్లా పూర్తవుతుందని ఆశాభావం
2019, జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. త్వరలోనే రెండు రాష్ట్రాల్లో హైకోర్టులు వేర్వేరుగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు పేర్కొంది. ఉమ్మడి హైకోర్టు విభజనపై ఇటీవల సుప్రీంలో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించాలని కేంద్రం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15 నాటికి హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
అమరావతిలో జస్టిస్ సిటీ నిర్మాణంలో ఉన్నందున తాత్కాలిక భవనంలో హైకోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అఫిడవిట్ ను సమర్పించింది. ఈ నేపథ్యంలో స్పందించిన జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ ల ధర్మాసనం.. హైకోర్టు జడ్జీలకు అద్దె భవనాల్లో తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యాక హైకోర్టు విభజన పూర్తి స్థాయిలో జరుగుతుందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.