kerala: తెరచుకున్న శబరిమల ఆలయ తలుపులు!
- సాయంత్రం ఐదు గంటలకు తెరచుకున్న ద్వారాలు
- నేటి నుంచి రెండ్రోజుల పాటు దర్శనం చేసుకోవచ్చు
- రాత్రి పది గంటల వరకు దర్శనానికి అనుమతి
శ్రీచిత్తిర తిరునాళ్ ఉత్సవం సందర్భంగా కేరళలోని అయ్యప్పస్వామి ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆలయం తలుపులు తెరిచి, దీపం వెలిగించారు. అనంతరం, అయ్యప్పస్వామిని భక్తులు దర్శించుకున్నారు. నేటి నుంచి రెండ్రోజుల పాటు అయ్యప్ప ఆలయంలో స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. రాత్రి పది గంటల వరకు స్వామి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.
కాగా, దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు వస్తే ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. 2,300 మంది పోలీసులను కేరళ ప్రభుత్వం మోహరించింది.