imrankhan: ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం.. పాక్ ప్రభుత్వ టీవీ ఛానెల్ లో తీవ్ర తప్పిదం!
- పీటీవీలో ఇమ్రాన్ ప్రసంగం లైవ్
- డేట్ లైన్ ని ‘బీజింగ్’కు బదులు ‘బెగ్గింగ్’గా పేర్కొన్న టీవీ
- ఈ పొరపాటుకు క్షమాపణలు చెప్పిన పీటీవీ
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న తరుణంలో ఆ దేశ ప్రభుత్వ టీవీ ఛానెల్ (పీటీవీ) ఓ పొరపాటు చేసింది. చైనాలో ఇమ్రాన్ ప్రసంగిస్తున్న కార్యక్రమాన్ని ‘లైవ్’ లో ప్రసారం చేస్తుండగా.. ‘బీజింగ్’ డేట్ లైన్ కు బదులు ‘బెగ్గింగ్’ అని ప్రసారం చేసింది. సుమారు ఇరవై సెకన్ల పాటు ‘బెగ్గింగ్’ అనేది ప్రసారమైంది.
అయితే, తక్షణమే ఈ పొరపాటును గుర్తించిన సదరు సంస్థ వెంటనే క్షమాపణలు కోరింది. కారణమైన సిబ్బందిపై సదరు మీడియా ఛానెల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఆ ఛానెల్ ఓ ట్వీట్ చేసింది. ఈ పొరపాటు చాలా బాధాకరమని, ఇందుకు బాధ్యలుపై కఠిన చర్యలకు ఆదేశించామని పేర్కొంది.
ఇదిలా ఉండగా, ‘బీజింగ్’కు బదులు ‘బెగ్గింగ్’ అని రాయడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై విచారణ జరపాలని పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి ఆదేశించారు.