Titli cyclone: తన సిబ్బందిని హెచ్చరించి.. తిత్లీ తుపాను పరిహారాన్ని తానే మింగేసిన తహసీల్దార్!

  • తిత్లీ తుపాను పరిహారాన్ని నొక్కేసిన తహసీల్దార్
  • తన భూమిలో జీడితోట ధ్వంసమైందంటూ తప్పుడు ధ్రువపత్రాలు
  • డమ్మీ చెక్‌తో బయటపడిన బాగోతం

తిత్లీ తుపాను బాధితులకు అన్యాయం జరగొద్దని, బాధితుల జాబితా విషయంలో అక్రమాలు జరిగితే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించిన ఓ తహసీల్దార్ స్వయంగా తానే అక్రమాలకు పాల్పడ్డారు. తప్పుడు ధ్రువపత్రాలతో ప్రభుత్వం అందించిన నష్టపరిహారాన్ని తన జేబులో వేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టిలో జరిగిందీ ఘటన.

మండలంలోని నందవ గ్రామానికి చెందిన జాలారి చలమయ్య మెళియాపుట్టి తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. తన సొంత గ్రామం తాను పనిచేస్తున్న మండలంలోనే ఉండడం, ఆ గ్రామంలో తనకు కొంత భూమి ఉండడంతో ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని కొట్టేయాలని పథకం వేశారు. అనుకున్నదే తడవుగా తుపాను కారణంగా తన పొలంలోని జీడితోట ధ్వంసమైనట్టు తప్పుడు ధ్రువపత్రాలు తయారు చేసి జాబితాలో తన పేరు ఎక్కించుకున్నారు.

బాధితులకు సోమవారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాలారి చలమయ్య పేరుతో డమ్మీ చెక్ ఉండడంతో అనుమానించిన గ్రామస్తులు.. ఆ పేరుతో తమ గ్రామంలో ఎవరున్నారంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీంతో అసలు విషయం ఆరా తీయగా తహసీల్దార్ రంగు బయటపడింది. పాతపట్నం గ్రామీణ బ్యాంకులో ఉన్న ఆయన ఖాతాను పరిశీలించగా సోమవారం మధ్యాహ్నం మూడుసార్లుగా రూ.12 వేలు, రూ.12 వేలు, రూ. 30 వేలు జమైనట్టు తేలింది. విషయం తెలిసిన గ్రామస్తులు తహసీల్దార్‌పై మండిపడుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News