kumaraswamy: ఘన విజయం సాధించిన కుమారస్వామి భార్య.. రెండు అసెంబ్లీ సీట్లూ కాంగ్రెస్-జేడీఎస్ కూటమివే!
- మూడు లోక్ సభ, రెండు శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు
- రెండు స్థానాల్లో ఓటమిపాలైన బీజేపీ
- రెండు లోక్ సభ స్థానాల్లో భారీ ఆధిక్యంలో కూటమి
కర్ణాటకలో మూడు లోక్ సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నిలలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సత్తా చాటుతోంది. రెండు శాసనసభ స్థానాలను కూటమి తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య, జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామి రామనగరం నియోకవర్గం నుంచి ఏకంగా 1,09,137 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. జామ్ ఖండీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి న్యామగౌడ 39,480 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.
బళ్లారి, శివమొగ్గ, మండ్య లోక్ సభ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప, మండ్యలో జేడీఎస్ అభ్యర్థి శివరామేగౌడలు పూర్తి ఆధిక్యతలో ఉన్నారు. శివమొగ్గలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర స్వల్ప మెజార్టీలో ఉన్నారు.