sabarimal: అపచారం.. శబరిమల ఆచారాలకు తూట్లు పొడిచిన ఆరెస్సెస్ నేత!
- ఇరుముడి లేకుండానే 18 మెట్లపై ఆరెస్సెస్ నేత
- మెట్లపై నుంచి ఆచారాలకు విరుద్ధంగా కిందకు దిగిన వైనం
- శబరిమల ఆలయంలో చోటుచేసుకున్న అపచారం
శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడాన్ని అయ్యప్ప భక్తులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో ఆచారాలకు ఇది విఘాతం కలిగిస్తుందని ఆరెస్సెస్ ఆధ్వర్యంలో భక్తుల ఆందోళన చేపట్టారు. ఆలయంలోకి మహిళలు ప్రవేశించకుండా వారు అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో, ఓ ఆరెస్సెస్ నేత చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
ఈరోజు 52 ఏళ్ల ఓ మహిళ ఆలయంలోకి వెళ్లేందుకు 18 బంగారు మెట్ల వరకు వెళ్లారు. ఆమెను ఆలయంలోకి ప్రవేశించనీయకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. దాదాపు 200 మంది భక్తులు ఆమెను చుట్టుముట్టి... స్వామియే శరణం అయ్యప్పా అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆమె ఆధార్ కార్డును పరిశీలించిన అధికారులు ఆమె వయస్సు 52 ఏళ్లని చెప్పడంతో... ఆలయంలోకి వెళ్లడానికి ఆందోళనకారులు ఆమెను అనుమతించారు.
వల్సాన్ తిల్లంకేరి అనే ఆరెస్సెస్ నేత ఈ సందర్భంగా ఆందోళనకారులకు నేతృత్వం వహించారు. ఇదే సమయంలో ఆయన చేయకూడని పని చేశారు. ఎప్పటి నుంచో ఉన్న ఆలయ ఆచారాలను ఆయన అతిక్రమించారు. తలపై ఇరుముడి లేకుండా 18 మెట్లపై కనిపించారు. ఈ మెట్లను ఎక్కే భక్తులు కచ్చితంగా ఇరుముడిని తలపై ఉంచుకోవాలి. అంతేకాదు ఈ మెట్లపై నుంచి ఆయన కిందకు కూడా దిగారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం మెట్లపై నుంచి కిందకు దిగడం కూడా అపచారమే. దీనిపై ఆలయ అర్చకులు, బోర్డు సభ్యులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.