minister kalva: కేంద్రం స్పందించనందునే ఉక్కు పరిశ్రమను నిర్మించాలని నిర్ణయించాం: మంత్రి కాలవ
- వచ్చే నెలలో కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన
- ఏపీఎండీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తాం
- విశాఖ మెట్రో నిర్మాణానికీ కేంద్రం ముందుకు రావట్లేదు
కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రం స్పందించనందునే ఆ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం నిర్మించాలని నిర్ణయించిందని మంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే నెలలో కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పమని, ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు.
ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయమై కేంద్రానికి మూడు ప్రతిపాదనలు పంపుతామని, ఉక్కు పరిశ్రమను కేంద్రం స్థాపించి రాయితీలు ఇస్తే ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని అన్నారు. విశాఖ మెట్రో నిర్మాణానికి కూడా కేంద్రం ముందుకు రావడం లేదని, దీంతో, రాష్ట్ర ప్రభుత్వమే ‘మెట్రో’ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిందని, వివిధ మార్గాల ద్వారా నిధులు సేకరించి దీన్ని నిర్మిస్తామని చెప్పారు. ఏ రాష్ట్రం పట్ల కూడా కేంద్రం ఇంత నిర్దయగా వ్యవహరించలేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తిత్లీ తుపాన్ వల్ల శ్రీకాకుళం జిల్లాలో తీరని నష్టం జరిగినా కేంద్రం పట్టించుకోవట్లేదని, విభజన హామీల అమలులో కనీస పురోగతి కూడా లేదని విమర్శించారు.