Telangana: ఓటింగ్ పై అవగాన కల్పించేందుకు బ్రాండ్ అంబాసిడర్ల నియామకం.. మహబూబ్ నగర్ కు హీరో విజయ్ దేవరకొండ!
- ఓటింగ్ పై అవగాహనకు అంబాసిడర్లను నియమించాం
- అన్ని జిల్లాలకు బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు
- సానియా, పుల్లెల గోపీచంద్ తదితరుల నియామకం
- తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్
తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం పలు రంగాలకు చెందిన ప్రముఖులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారు. ఈ విషయాన్ని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు.
అన్ని జిల్లాలకు బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారని, టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న అంబాసిడర్లుగా వ్యవహరిస్తారని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాకు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారని అన్నారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు అధిక శాతం పోలింగ్ నమోదయ్యేలా చూసేందుకు వినూత్న చర్యలు చేపడుతోందని రజతకుమార్ తెలిపారు. దివ్యాంగులకు ఓటింగ్ కోసం చేసిన ఏర్పాట్లపై హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న హరిత ప్లాజాలో ఎన్నికల సంఘం సదస్సు ఏర్పాటు చేసింది.
ఈ సదస్సులో పాల్గొన్న రజత్ కుమార్ మాట్లాడుతూ, దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. దివ్యాంగుల కోసం పది నుంచి పదిహేను వీల్ చైర్స్ అందుబాటులో ఉంచడంతో పాటు ఆటోల సాయంతో పోలింగ్ కేంద్రాలకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామని అన్నారు. దివ్యాంగుల కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని, సీవిజిల్ ద్వారా ఇప్పటి వరకు 1457 ఫిర్యాదులు అందాయని తెలిపారు.