fire crackers: బాణసంచా అనుమతుల కోసం లంచం డిమాండ్.. ఇద్దరు ఉద్యోగులపై వేటేసిన వైజాగ్ జాయింట్ కలెక్టర్!
- జిల్లాలోని మాకవరపాలెంలో ఘటన
- లంచం డిమాండ్ చేసిన రమేశ్, రాజు
- సస్పెండ్ చేసిన జేసీ శ్రీజన
విశాఖపట్నంలో దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయానికి లంచం డిమాండ్ చేసిన సిబ్బందిపై జాయింట్ కలెక్టర్ జి.శ్రీజన కొరడా ఝుళిపించారు. విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అంతర్గత విచారణకు ఆదేశించడంతో పాటు విచారణ పూర్తయ్యేవరకూ విధులకు దూరంగా ఉండాలని ఆదేశించారు.
జిల్లాలోని మాకవరపాలెం మండల కార్యాలయంలో ఆర్ఐ రమేశ్, సీనియర్ అసిస్టెంట్ గా రాజు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాణసంచా అమ్మకాలకు అనుమతులు కావాలంటే లంచం ఇవ్వాలని వీరు వ్యాపారస్తులను వేధించారు. దీంతో వారంతా జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై స్పందించిన జేసీ శ్రీజన.. రాజు, రమేశ్ లను సస్పెండ్ చేశారు. విచారణ పూర్తయ్యేవరకూ విధులకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఉద్యోగులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు.