Chandrababu: నరేంద్ర మోదీపై పోరు... నేడు కర్ణాటకకు చంద్రబాబు!
- నేడు దేవెగౌడ, కుమారస్వామితో చర్చలు
- మధ్యాహ్నం ఒంటిగంటకు బెంగళూరుకు ఏపీ సీఎం
- ఈ వారం చివరిలో స్టాలిన్ తోనూ భేటీ
బీజేపీ నేత, ప్రధాని నరేంద్ర మోదీపై పోరాటాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో ఎన్డీయేను అధికారం నుంచి దూరం చేయడమే లక్ష్యంగా విపక్ష పార్టీలను ఏకం చేసే పనిని తన భుజస్కంధాలపైకి తీసుకున్నారు. ఇప్పటికే న్యూఢిల్లీ వెళ్లి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, కేజ్రీవాల్ తదితరులను కలిసి మద్దతు అడిగిన ఆయన, నేడు కర్ణాటక వెళ్లనున్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేసేందుకు జేడీఎస్ మద్దతును ఆయన కోరనున్నట్టు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు బెంగళూరు బయలుదేరే ఆయన, మూడు గంటలకు మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. బెంగళూరు పద్మనాభనగర్ లోని దేవెగౌడ నివాసంలో ఈ భేటీ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ వారం చివరిలో చెన్నై వెళ్లనున్న చంద్రబాబు డీఎంకే అధినేత స్టాలిన్ తోనూ చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.
ఆపై జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస భేటీలు జరిపి, ఓ కూటమిని ఏర్పాటు చేసి, అన్ని రాష్ట్రాల్లో బలమైన ఉమ్మడి అభ్యర్థులను నిలపడం ద్వారా, ఎన్డీయేను అధికారానికి దూరం చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా సమాచారం.