Telangana: 9 నుంచి 5కు దిగివచ్చాం... అయినా కాంగ్రెస్ మెలిక: చాడ వెంకట్ రెడ్డి
- మూడు ఎమ్మెల్యే స్థానాలే ఇస్తామంటున్న కాంగ్రెస్
- మహాకూటమి ఏర్పాటులో సీపీఐ కీలక పాత్ర
- నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్సేనన్న చాడ
మహాకూటమితో పొత్తులో భాగంగా, తాము ఎంతగా దిగివచ్చినా, కాంగ్రెస్ ఇంకా మెలికలు పెడుతోందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, మహాకూటమి ఏర్పాటు విషయంలో తాను ఎంతో చొరవ తీసుకున్నానని తెలిపారు. తాము 9 స్థానాలను అడిగామని, చివరకు 5 స్థానాలు ఇచ్చినా కూటమిలో కలిసుంటామని చెప్పామని గుర్తు చేశారు.
కానీ కాంగ్రెస్ మాత్రం 3 ఎమ్మెల్యే స్థానాలను, 2 ఎమ్మెల్సీ స్థానాలను ఆఫర్ చేస్తోందని, దీనికి తాము అంగీకరించబోవడం లేదని చెప్పారు. చివరి ఆప్షన్ గా నాలుగు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎమ్మెల్సీని తాము కోరుతున్నామని, అందుకు కూడా అంగీకరించకుంటే, కూటమికి దూరం కావడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు.
కూటమిని స్థిరంగా ఉంచాలన్నదే సీపీఐ అభిమతమని, అందుకోసం పలు ప్రతిపాదనలను సిద్ధం చేశామని, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ పెద్దలేనని చాడ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తామని తెలిపారు.