Chandrababu: బీజేపీని ఇంటికి పంపించే బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారు: దేవేగౌడ
- ఎన్డీయే హయాంలో దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది
- ఎన్డీయేను సాగనంపడానికి విపక్ష పార్టీలన్నీ ఏకం కావాలి
- మహాకూటమి ఏర్పాటులో భాగంగానే చంద్రబాబు ఇక్కడకు వచ్చారు
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో యావత్ దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నదని మాజీ ప్రధాని దేవేగౌడ విమర్శించారు. అత్యంత కీలకమైన వ్యవస్థలను కూడా నాశనం చేశారని మండిపడ్డారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ సహా ఎన్డీయేతర పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
అన్ని పార్టీలను ఏకం చేసే కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని... ఇప్పటికే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిశారని చెప్పారు. తనతోపాటు ఫరూక్ అబ్దుల్లా, మాయావతి, మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టాలిన్ లతో ఆయన ఇప్పటికే చర్చలు జరిపారని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో దేవేగౌడ, కుమారస్వామిల భేటీ కాసేపటి క్రితం ముగిసింది. అనంతరం మీడియాతో దేవేగౌడ మాట్లాడుతూ వైవిధంగా వ్యాఖ్యానించారు.
సెక్యులర్ పార్టీలన్నీ కలసి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని దేవేగౌడ అన్నారు. మహాకూటమిని ఏర్పాటు చేసే క్రమంలోనే చంద్రబాబు ఇక్కడకు వచ్చారని చెప్పారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందని జోస్యం చెప్పారు. 2019లో బీజేపీని ఇంటికి పంపించే బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారని అన్నారు.