Telangana: ఇండియా టుడే తాజా సర్వే.. తెలంగాణలో టీఆర్ఎస్ హవా!

  • తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్సే
  • కేసీఆర్‌కు మేలు చేయనున్న సంక్షేమ పథకాలు
  • మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లు మళ్లీ బీజేపీవే

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ‘ఇండియా టుడే’కు చెందిన ‘పొలిటికల్ స్టాక్ ఎక్స్‌చేంజ్’(పీఎస్ఈ) నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో మరోమారు టీఆర్ఎస్ జయకేతనం ఖాయమని తేలగా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ మరోమారు విజయం సాధిస్తుందని తేల్చింది. రాజస్థాన్‌లో మాత్రం బీజేపీకి ఘోర పరాజయం తప్పదని సర్వేలో వెల్లడైంది.

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కేసీఆర్‌కు బోనస్ అవుతాయని సర్వే తేల్చింది. 44 శాతం మంది కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోగా, 34 శాతం మంది ప్రభుత్వ మారాలని అభిప్రాయపడ్డారు. ఈ గణాంకాల ప్రకారం.. టీఆర్ఎస్ మళ్లీ విజయం సాధించడం ఖాయమని చెన్నై మేథమెటికల్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సెఫాలజిస్ట్ రాజీవ్ కరాండికర్ పేర్కొన్నారు.  టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం 75 శాతం ఉందన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్‌కు మజ్లిస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని, ఆ పార్టీ విజయావకాశాలను మజ్లిస్ దారుణంగా దెబ్బతీస్తుందని పీఎస్ఈ వెల్లడించింది.  

ఇక, మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ సర్కారు మళ్లీ అధికారంలోకి రానుందని సర్వే చెప్పుకొచ్చింది. అయితే, బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా ఒకటి నుంచి మూడు శాతం మాత్రమే ఉండే అవకాశం ఉందని పీఎస్ఈ పేర్కొంది. బీఎస్పీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే మాత్రం విజయం ఖాయమని స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం చౌహాన్ సర్కారుకే ఓటేయగా, 40 శాతం మంది ప్రభుత్వం మారాలని అభిప్రాయపడ్డారు.  ఇక్కడ బీజేపీ 116 స్థానాల్లో, కాంగ్రెస్ 105 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

రాజస్థాన్ విషయానికొస్తే వసుంధర రాజే ప్రభుత్వంపై మైనారిటీ, నిమ్నవర్గాల్లో ఉన్న ఆగ్రహం చేటు చేస్తుందని సర్వేలో వెల్లడైంది. రాజేకు కేవలం 35 శాతం మాత్రమే అవకాశం ఉంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 110 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా, బీజేపీ 84 స్థానాలకే పరిమితం కానుంది. అశోక్ గెహ్లెట్ వైపు రాష్ట్రంలోని ఎక్కువమంది మొగ్గుచూపారు. చత్తీస్‌గఢ్‌లో మాత్రం బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పీఎస్ఈ తేల్చింది. రమణ్‌సింగ్ ప్రభుత్వం తిరిగి రావాలని 55 శాతం మంది కోరుకున్నారు. ఇక్కడ బీజేపీకి 56 సీట్లు, కాంగ్రెస్‌కు 25 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.

  • Loading...

More Telugu News