kollywood: మురుగదాస్ కు అరెస్ట్ గండం.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన దర్శకుడు!
- తమిళనాడులో ‘సర్కార్’ సెగలు
- నిన్నరాత్రి మురుగదాస్ ఇంటికి పోలీసులు
- నేడు పిటిషన్ ను విచారించనున్న హైకోర్టు
ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఈ రోజు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సర్కార్ సినిమాపై వివాదం నేపథ్యంలో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. నిన్న రాత్రి మురుగదాస్ ఇంటికి పోలీసులు వెళ్లినట్లు సర్కార్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మురుగదాస్ కోర్టును కోరారు.
విజయ్, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమాలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితను, ఆమె ప్రవేశపెట్టిన పథకాలను కించపరిచేలా సీన్లు ఉన్నట్లు అన్నాడీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాతలకు, అన్నాడీఎంకే నేతల మధ్య నిన్న జరిగిన చర్చల్లో సయోధ్య కుదిరింది.
ఇందులో భాగంగా అభ్యంతరకరంగా ఉన్న సీన్లను తొలగించేందుకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అంగీకరించింది. ఇంతలోనే మురుగదాస్ ఇంటికి పోలీసులు వెళ్లడం, ఆయన హైకోర్టును ఆశ్రయించడం చకచకా సాగిపోయాయి. మరోవైపు సర్కార్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద అధికార అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు. కాగా, మురుగదాస్ దాఖలుచేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు ఈ రోజు సాయంత్రం విచారణ చేపట్టనుంది.