West Godavari District: పగలు నైటీ ధరిస్తే జరిమానా విధిస్తాం.. పశ్చిమగోదావరిలో కుల పెద్దల విచిత్ర తీర్పు!

  • తు.చ.తప్పకుండా పాటిస్తున్న గ్రామస్తులు
  • గత 6 నెలలుగా అమలవుతున్న వైనం
  • మీడియా చొరవతో వెలుగులోకి

అమ్మాయిలు జీన్స్ వేసుకోకూడదనీ, ఫోన్ లో మాట్లాడకూడదని వింత తీర్పులు ఇచ్చే పంచాయితీల గురించి చదివే ఉంటాం. అత్యాచారాలు జరగడానికి అమ్మాయిల దుస్తులే కారణమనీ, రాత్రిపూట బయటకు రాకూడదని నీతులు చెప్పే పెద్దల గురించి వినే ఉంటాం. అయితే ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఊరిలో కుల పెద్దలు మరో అడుగు ముందుకు వేశారు. మహిళలు నైటీ ధరించి బయటకు వస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

జిల్లాలోని నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో ఈ వింత పరిస్థితి నెలకొంది. మహిళలు ఎవరైనా సరే పగటి పూట నైటీ వేసుకుని ఇంటి నుంచి బయటకు రావడానికి లేదని కుల పెద్దలు హుకుం జారీచేశారు. తీర్పును ఉల్లంఘిస్తే రూ.2,000 జరిమానా వేస్తామన్నారు. నైటీ వేసుకుని పగటిపూట తిరిగేవారిని చూపితే రూ.వెయ్య నజరానాగా ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఊరంతా దండోరా వేయించారు. మహిళలు రాత్రిపూట మాత్రమే వాటిని వేసుకోవాలని షరతు విధించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే గ్రామ బహిష్కరణకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు.

కాగా, ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మహిళల దుస్తుల విషయంలో కుల పెద్దల జోక్యం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే మహిళలు నైటీల మీదే మార్కెట్లు, షాపులు, పాఠశాలలు, ఆసుపత్రులకు వచ్చేస్తున్నారనీ, అందుకే కుల పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తీర్పు గత 6 నెలలుగా అమలవుతోందని వెల్లడించారు.

తోకలపల్లి గ్రామంలో న్యాయవ్యవస్థ గ్రామ కమ్యునిటీహాల్‌ వద్దే ఉంటుంది. ఏటా వడ్డీల కులస్తులంతా ఏకమై 9 మంది కులపెద్దలను ఎన్నుకుంటారు. వీరు తీసుకునే నిర్ణయాలను గ్రామస్తులంతా పాటిస్తారు. కాగా, ఈ వ్యవహారం మీడియాలో రావడంతో ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News