CPI: మహాకూటమికి అల్టిమేటం జారీ చేసిన సీపీఐ!
- మాకు మూడు సీట్లను మాత్రమే కేటాయించడం దారుణం
- కనీసం ఐదు సీట్లైనా ఇవ్వాలి
- ఎల్.రమణ, జానారెడ్డి, కోదండరామ్ లను కలుస్తాం
మహాకూటమిలో భాగస్వామి అయిన తమకు కేవలం మూడు సీట్లను మాత్రమే కేటాయించడంపై సీపీఐ మండిపడింది. తమతో ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా 3 సీట్లను మాత్రమే కేటాయించడం దారుణమని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. తమకు కనీసం ఐదు సీట్లైనా కేటాయించాలని డిమాండ్ చేశారు.
బలం లేని స్థానాలను తమకు అంటగడితే ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కొత్తగూడెం, మంచిర్యాల, హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా స్థానాలను తమకు కేటాయించాలని చెప్పారు. తమ కార్యవర్గ సమావేశాన్ని సాయంత్రానికి వాయిదా వేశామని తెలిపారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరామ్ లను కలవాలని నిర్ణయించామని చెప్పారు. టీడీపీకి 14, టీజేఎస్ కు 8, సీపీఐకి 3, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక్క సీటును కాంగ్రెస్ కేటాయించిన సంగతి తెలిసిందే.