jogi ramesh: వైసీపీలో వర్గ విభేదాలు.. జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసం!
- పెడన బస్టాండు వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ
- ఘర్షణలో రాంప్రసాద్ కుమారుడికి గాయాలు
- పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్న ఇరు వర్గాలు
కృష్ణా జిల్లా పెడన వైసీసీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జోగి రమేష్, ఉప్పాల రాంప్రసాద్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. బస్టాండు వద్ద నడిరోడ్డుపైనే కొట్టుకున్నాయి. మచిలీపట్నానికి ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో జోగి రమేష్ కారు అద్దాలను రాంప్రసాద్ వర్గీయులు పగలగొట్టారు. అనంతరం ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.
పెడన నుంచి పోటీ చేయాలని రాంప్రసాద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, జోగి రమేష్ కు అనుకూలంగా వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఆయనను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. సమన్వయకర్తగా జోగి రమేష్ బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఇరు వర్గాలు దూరంగానే ఉంటూ వచ్చాయి. పార్టీ కార్యక్రమాలను కూడా ఇరు వర్గాలు విడివిడిగానే నిర్వహిస్తున్నాయి. కారు అద్దాలు పగలగొట్టిన సమయంలో జోగి రమేష్ కారులో కాకుండా, బైక్ పై వెళ్తుండటంతో ఆయనకు ఏమీ కాలేదు. ఈ ఘటనలో రాంప్రసాద్ కుమారుడు రామ్ కు గాయాలయ్యాయి.