Harish Rao: ఎవడు పడితే వాడు హరీశ్‌రావు గురించి మాట్లాడుతున్నాడు: ఈటల రాజేందర్
- కరెంట్ అడిగితే కాల్పులు జరిపిన పార్టీలు ఒక్కటయ్యాయి
- మత్స్య సహకార భవనాలు నిర్మిస్తున్న ఘనత టీఆర్ఎస్దే
- నీళ్లను తెచ్చే పనిని కేసీఆర్, హరీశ్ చేపట్టారు
ప్రతిపక్ష పార్టీలు మంత్రి హరీశ్ రావును టార్గెట్ చేయడంపై మరో మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. సిద్దిపేటలోని తాడూరి బాలాగౌడ్ గ్రౌండ్స్‌లో హరీశ్ రావుకు మద్దతుగా ముదిరాజ్ కులస్తుల ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభలో ఈటల మాట్లాడుతూ.. ఎవడు పడితే వాడు హరీశ్ రావు గురించి మాట్లాడుతున్నాడని.. తమతో తలపడలేని దుర్మార్గ నాయకులే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్ష నేతలు ఇలాంటి ప్రయత్నాలను మానుకోవాలని ఈటల హెచ్చరించారు.
కరెంట్ అడిగితే కాల్పులు జరిపిన టీడీపీ, కాంగ్రెస్ ఇప్పుడు ఏకమయ్యాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో మత్స్య సహకార భవనాలు నిర్మిస్తున్న ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్నారు. ముదిరాజ్ కులం నీళ్లతో ముడిపడిన కులమని.. ఆ నీళ్లను తెచ్చే పనిని కేసీఆర్, హరీశ్ చేపట్టారని ఈటల తెలిపారు. రూ.1000 కోట్లతో మత్స్యకారులకు సైకిళ్లు, వాహనాలు, ఐస్ డబ్బాలు అందజేశారని.. ముదిరాజ్‌ల సంక్షేమం కోసం ఇంతలా పాటుపడే ముఖ్యమంత్రి ఒక్క కేసీఆరేనన్నారు.