Chandrababu: మాతో చేతులు కలుపుతారో, లేదో అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయించుకోవాలి: చంద్రబాబు
- మహాకూటమిలో చేరని పార్టీలన్నీ బీజేపీకి మద్దతుగా ఉన్నట్టే
- తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు మోదీ గుప్పిట్లో ఉన్నాయి
- రాజకీయ ప్రయోజనాల కోసమే నోట్ల రద్దు
బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విస్తృతమైన కూటమిని ఏర్పాటు చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ ఈ కూటమిలో చేరాలని పిలుపునిచ్చారు. తమతో చేతులు కలుపుతారో, లేదో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయించుకోవాలని అన్నారు. మహాకూటమిలో చేరని పార్టీలన్నీ బీజేపీకి మద్దతుగా ఉన్నట్టేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, కొన్ని పార్టీలు ఇప్పుడు తమతో కలసి రాకున్నా... ఎన్నికల తర్వాత కలుస్తాయని చెప్పారు. మోదీ గుప్పిట్లో తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు. ఎటువైపు ఉండాలో అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయించుకోవాలని చెప్పారు.
డిజిటల్ కరెన్సీని తీసుకురావడానికి తాను చేసిన సూచనలను మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. నల్లధనాన్ని కట్టడి చేయడానికి మాత్రమే తాము సహకరిస్తామని చెప్పామని... ప్రజలను ఇబ్బంది పెట్టడానికి సహకరిస్తామని చెప్పలేదని అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి... రూ. 2వేల నోట్లను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే నోట్లను రద్దు చేశారని మండిపడ్డారు.