Hyderabad: బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 536... పీకల వరకూ తాగి అమ్మాయిల తైతక్కులు!
- హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
- పోలీసులకు సహకరించని అమ్మాయిలు
- అమ్మాయి బీఏసీ చూసి పోలీసుల అవాక్కు
గత రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేయగా, పలువురు అమ్మాయిలు అడ్డంగా దొరికిపోయారు. వీరిలో ఓ అమ్మాయికి బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 536 రావడంతో పోలీసులే అవాక్కైన పరిస్థితి. పీకల వరకూ తాగిన కొందరు యువతులు రోడ్డుపై తనిఖీలకు సహకరించకుండా తైతక్కలాడటంతో, లా అండ్ ఆర్డర్ పోలీసులను పిలిపించి వారిని అదుపు చేశారు ట్రాఫిక్ పోలీసులు. జూబ్లీహిల్స్ లో ఈ ఘటన జరిగింది.
సాధారణంగా ఓ పెగ్గు తాగితే 30 వరకూ బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ నమోదవుతుంది. రెండు గంటల వ్యవధిలో ఫుల్ బాటిల్ లేపేస్తే, 320 వరకూ కౌంట్ వస్తుంది. ఇక బీఏసీ 536 వచ్చిందంటే, ఆ అమ్మాయి ఎంతగా తాగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంత మత్తులోనూ కారును నడుపుకుంటూ వచ్చిన ఆమె, తాను తాగలేదని చెబుతూ తనిఖీలకు నిరాకరించగా, మహిళా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి, ఆమెను అదుపు చేసి తనిఖీలు చేశారు. ఆపై వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
శనివారం నాటి తనిఖీల్లో 50కిపైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ చేసి, కోర్టులో హాజరు పరుస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.