deepa: 'సర్కార్'పై ఎందుకీ రాద్ధాంతం... అమ్మ అసలు పేరు కోమలవల్లి కాదు: దీప
- గతవారం విడుదలైన 'సర్కార్'
- సినిమాను నిషేధించాలని అన్నాడీఎంకే డిమాండ్
- స్పందించిన జయ మేనకోడలు దీప
విజయ్ హీరోగా నటించిన 'సర్కార్' చిత్రం గతవారంలో విడుదల కాగా, తమిళనాట అన్నాడీఎంకే వర్గాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ప్రతినాయకి పాత్రకు కోమలవల్లి అన్న పేరు పెట్టడం, ఆ పాత్ర తన తండ్రిని స్వయంగా హతమార్చి పార్టీని తన చేజిక్కించుకోవడం తదితర సీన్లు ఉండటంతో, జయలలితను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తీశారని, వెంటనే సినిమాను బ్యాన్ చేయాలని అన్నాడీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, జయలలిత మేనకోడలు దీప మీడియా ముందుకు వచ్చారు.
తమిళ ప్రజలు అమ్మగా పిలుచుకునే జయలలిత అసలు పేరు కోమలవల్లి కాదని అన్నారు. మైసూర్ లో పుట్టిన ఆమెకు జయ అనే పేరునే పెట్టారని, ఆమె గురించి తన తండ్రికి బాగా తెలుసునని, చిన్నప్పుడు అమ్ము అని ముద్దుగా పిలుచుకునేవారని అన్నారు. ఈ సినిమాపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా, శశికళ వర్గం నేత దినకరన్ సైతం జయలలిత అసలు పేరు కోమలవల్లి కాదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.