YSRCP: కొడుకుపైనే సీబీఐ ఎంక్వయిరీ వేయించిన ఏకైక నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే: విజయమ్మ
- వైఎస్ సీఎంగా ఉన్న వేళ పరిటాల రవి హత్య
- అసెంబ్లీలో జగన్ పై చంద్రబాబు ఆరోపణలు
- వెంటనే సీబీఐ విచారణకు వైఎస్ ఆదేశాలు
- గుర్తు చేసిన వైఎస్ విజయమ్మ
వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వేళ, పరిటాల రవి హత్య జరిగితే, తన బిడ్డ జగన్ పై ఆరోపణలు చేస్తూ, చంద్రబాబునాయుడు నానాయాగీ చేశారని, ఆ సమయంలో నిజాన్ని నిగ్గుతేల్చాలన్న ఉద్దేశంతో హత్యపై విచారణను సీబీఐకి అప్పగించారని వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, కన్న కొడుకుపై ఆరోపణలు వస్తే, సీబీఐ విచారణకు ఆదేశించిన మహానేత వైఎస్ అని కొనియాడారు. కొడుకుపై సీబీఐ విచారణకు ఆదేశించిన ఏకైక నేత కూడా ఆయనేనని అన్నారు. ఆ నేత బిడ్డగా నేడు ప్రజల ముందున్న జగన్ ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు.
నేడు జగన్ పై హత్యాయత్నం విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తుంటే, టీడీపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని విజయమ్మ ప్రశ్నించారు. రోజుకో అబద్ధపు ప్లెక్సీలు సృష్టించి, కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిందితుడు నిజంగా జగన్ అభిమాని అయితే, నాలుగు నెలలుగా ప్రతివారం విశాఖ ఎయిర్ పోర్టుకు వస్తున్న జగన్ ను అతను ఎందుకు కలవలేదని అడిగారు. అభిమాని అయితే గొంతుకు కత్తి ఎలా పెడతాడని ప్రశ్నించారు. నిజంగా అభిమాని అయినా, విచారణ జరిపించాల్సిన అవసరం చంద్రబాబుకు లేదా? అని నిప్పులు చెరిగారు.