Chandrababu: ఎన్నికలెప్పుడొచ్చినా టీడీపీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలి: కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు
- ఐఏఎస్ కావాల్సిన శ్రావణ్ మంత్రి కావడం వినూత్న పరిణామం
- శ్రావణ్ కు అందరూ అండగా నిలవాలి
- పార్టీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దు
ఏపీలో ఎన్నికలెప్పుడొచ్చినా టీడీపీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. అమరావతిలో నిర్వహించిన ప్రజావేదికలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పాటుపడాలని అన్నారు.
ముస్లిం, మైనారిటీ వర్గాలకు ఎప్పుడూ లేని విధంగా పదవులు ఇచ్చామని అన్నారు. మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల గురించి ఆయన ప్రస్తావించారు. ఐఏఎస్ కావాల్సిన కిడారి సర్వేశ్వరరావు కొడుకు శ్రావణ్ మంత్రి కావడం వినూత్న పరిణామమని, శ్రావణ్ లో సర్వేశ్వరరావును చూసుకుంటూ అంతా అండగా నిలబడాలని సూచించారు.
సర్వేశ్వరరావు రెండో కుమారుడు సందీప్ కు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నామని చెప్పారు. సివేరి సోమ తనయుడు అబ్రహాంను ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. పార్టీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని, వారికి ఏ కష్టమొచ్చినా పార్టీ అండగా ఉంటుందని, నష్టపోయిన కుటుంబాలకు అన్ని విధాలుగా చేయూతనిస్తామని అన్నారు.
కాగా, ఏపీ మంత్రివర్గ విస్తరణ ఈరోజు ఉదయం జరిగింది. కొత్త మంత్రులుగా కిడారి శ్రావణ్, ఎన్.ఎమ్.డి. ఫరూక్ లు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రావణ్ కు గిరిజన సంక్షేమ శాఖను, ఫరూక్ కు వైద్యఆరోగ్య శాఖను కేటాయిస్తారని సమాచారం.