congress: ప్యారాచూట్ నేతలకు సీట్లు కేటాయించొద్దు: ‘కాంగ్రెస్’ టికెట్లు ఆశిస్తున్న ఎస్సీ ఆశావహులు
- ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావహుల ధర్నా
- పార్టీని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాం
- కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు
ప్యారాచూట్ నేతలకు కాంగ్రెస్ పార్టీ సీట్లు కేటాయించొద్దని ఆ పార్టీ టికెట్లు ఆశిస్తున్న ఎస్సీ ఆశావహులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావహుల ధర్నా కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీలో క్రియాశీలక సభ్యత్వం లేని నాయకులకు టికెట్లు ఇవ్వొద్దని నినదించారు.
స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఆశావహులు విజయరామారావు, కడాని నాగేశ్వరరావు, ధర్మపురి, చేవెళ్లకు చెందిన ఆశావహులు గడ్డం రాజేష్, శ్యాంరావు, అంబేద్కర్ వద్ద నిరసనలో పాల్గొన్న తుంగతుర్తి ఆశావహులు రవిబాబులు ఈ విషయమై మండిపడ్డారు. పార్టీని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని, రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ప్యారా చూట్ నేతలకు టికెట్లు ఇవ్వొద్దని అన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పీసీసీ నేతలు టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారని, అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత పాటించడం లేదని విమర్శించారు.
కాగా, వరంగల్ పశ్చిమ టికెట్ ను టీడీపీకి ఇవ్వొద్దని, ఆ టికెట్ ను నాయిని రాజేందర్ రెడ్డి కే ఇవ్వాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజేందర్ రెడ్డి మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు.