Andhra Pradesh: ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ తో కలుస్తున్నారు? ఏపీ ప్రజలకు జవాబు చెప్పండి!: బీజేపీ నేత పురందేశ్వరి
- ఏపీకి నిధులు ఇచ్చేందుకు కేంద్రం రెడీ
- టీడీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారు
- కర్నూలులో మాట్లాడిన పురందేశ్వరి
తెలుగుదేశం నేతలు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి ఆరోపించారు. ఏపీకి ఎన్ని నిధులు అవసరమైనా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ రోజు కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
బీజేపీకి వ్యతిరేకంగా ఏ కూటమి ఏర్పాటైనా తమకు ఇబ్బంది లేదని పురందేశ్వరి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను తీవ్రంగా ద్వేషించిన టీడీపీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అదే పార్టీతో జతకడుతోందని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ప్రభుత్వ పెద్దలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కీలక శక్తిగా మారుతామని ధీమా వ్యక్తం చేశారు.