Telugudesam: తెలంగాణలో టీడీపీ పోటీ చేసే పది స్థానాలివే.. నాలుగు స్థానాలపై అర్ధరాత్రి వరకు చర్చలు
- సనత్నగర్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, నకిరేకల్ స్థానాలపై టీడీపీ పట్టు
- కుదరదన్న కాంగ్రెస్
- ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన వైనం
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలపై దాదాపు స్పష్టత వచ్చింది. ఆ పార్టీకి కేటాయించిన 14 స్థానాల్లో పది స్థానాలు ఖరారవగా మిగతా నాలుగింటి కోసం ఆదివారం అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. అయినప్పటికీ స్పష్టత రాలేదు. టీడీపీ కోరుకుంటున్న సీట్లను కాంగ్రెస్ అడుగుతుండడంతో ప్రతిష్ఠంభన ఏర్పడింది. సత్తుపల్లి, అశ్వారావుపేట, ఖమ్మం, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మక్తల్, మహబూబ్నగర్, వరంగల్ పశ్చిమ, రాజేంద్రనగర్, ఉప్పల్ స్థానాల్లో టీడీపీ పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. సోమవారం ప్రకటించనున్న తొలి విడత జాబితాలో వీటిని ప్రకటించే అవకాశం ఉంది.
టీడీపీకి కేటాయించాల్సిన మిగతా నాలుగు స్థానాల్లో సనత్నగర్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్ స్థానాల్లో గతంలో టీడీపీ విజయం సాధించడంతో వాటిని తమకు కేటాయించాలని టీడీపీ పట్టుబడుతోంది. అయితే, అక్కడ కాంగ్రెస్కు బలమైన నేతలు ఉండడంతో ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదు. దీంతో ప్రత్యామ్నాయంగా ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఇబ్రహీంపట్నం స్థానాల్లో పోటీ చేయాల్సిందిగా కోరుతున్నా టీడీపీ ఇష్టపడడం లేదు. ఇంకో స్థానాన్ని నిజామాబాద్లో బాల్కొండ లేదంటే బాన్సువాడ, నల్గొండ జిల్లాలో నకిరేకల్ లేదంటే ఆలేరు ఇవ్వాలని టీడీపీ కోరుతోంది. దీంతో చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. అయితే, ఈ నాలుగింటి విషయంలో నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉందని మహాకూటమి నేతలు చెబుతున్నారు.