breath test: ఎయిరిండియా ప్రయాణికులకు కలిసి రాని ఆదివారం.. బయలుదేరిన కాసేపటికే వెనక్కి వచ్చిన విమానాలు!
- బ్రీత్ అనలైజర్ పరీక్షను స్కిప్ చేసిన పైలట్లు
- వెనక్కి రప్పించిన అధికారులు
- ఐదు గంటలపాటు నరకం చూసిన ప్రయాణికులు
ఎయిరిండియా ప్రయాణికులకు ఆదివారం కలిసి వచ్చినట్టు లేదు. ఆ సంస్థకు చెందిన రెండు విమానాలు బయలుదేరిన కాసేపటికే వెనక్కి వచ్చాయి. పైలట్లు బ్రీత్ అనలైజర్ టెస్టును తప్పించుకోవడమే అందుకు కారణం. మార్గమధ్యంలో విమానాలు వెనక్కి మళ్లడంలో ఏం జరిగిందో అర్థంకాక ప్రయాణికులు ఆందోళన చెందారు.
ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఏఐ 111 విమానం డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అర్వింద్ కఠపాలియా బ్రీత్ అనలైజర్ టెస్టులో విఫలం కావడంతో విమానాన్ని వెనక్కి రప్పించారు. మరో ఘటనలో ఢిల్లీ నుంచి బ్యాంకాక్ బయలుదేరిన ఏఐ 332 విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత వెనక్కి వచ్చింది. విమానం బయలుదేరడానికి ముందు నిర్వహించే బ్రీత్ అనలైజర్ టెస్టును విమానం కో పైలట్ తప్పించుకోవడమే అందుకు కారణం.
ఏఐ 332 విమానం ఢిల్లీలో మధ్యాహ్నం 1:45 గంటలకు బయలుదేరాల్సి ఉండగా అరగంట ఆలస్యంగా బయలుదేరింది. అయితే, ఆ తర్వాత అరగంటకే తిరిగి ఢిల్లీలో ల్యాండ్ అయింది. విమానాన్ని వెనక్కి మళ్లిస్తున్నట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు. పైలట్ల తప్పిదం కాకుండా దాదాపు ఐదు గంటలపాటు నరక యాతన అనుభవించాల్సి వచ్చిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది ప్రయాణికులు తమ అసహనాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.