Telangana: నేటి నుంచి ఎనిమిది రోజుల పాటు నామినేషన్లు... మంచి రోజులు రెండే!
- పురోహితులను ఆశ్రయిస్తున్న అభ్యర్థులు
- 14, 19 మంచి రోజులంటున్న పండితులు
- 14న నామినేషన్ దాఖలు చేయనున్న కేసీఆర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్ కొద్దిసేపటిక్రితం అధికారికంగా విడుదలైంది. నేటి నుంచి 19వ తేదీ వరకూ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. ఈ ఎనిమిది రోజుల వ్యవధిలో కేవలం రెండు రోజులే మంచివని ప్రచారం జరుగుతోంది. మంచి ముహూర్తాలు ఈ నెల 14, 19వ తేదీల్లో ఉన్నాయని, పండితులు తేల్చి చెబుతూ ఉండటంతో, ఆ రెండు రోజుల్లోనే అత్యధిక నామినేషన్లు దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ సైతం 14వ తేదీన నామినేషన్ వేసేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారన్న సంగతి తెలిసిందే.
కాగా, షెడ్యూల్ ప్రకారం, నేడు 11 గంటల నుంచి 3 గంటల వరకూ నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఈ సమయం మంచిది కాదట. ఇక రేపు మంగళవారం, 13వ తేదీ సెంటిమెంట్ కారణంగా ఎవరూ నామినేషన్లు వేయాలని భావించడం లేదు. ఇక 14వ తేదీ బుధవారం, సప్తమీ తిథి, శ్రవణా నక్షత్రం కావడంతో నామినేషన్ల దాఖలుకు అత్యంత శుభ ప్రదమని పండితులు చెబుతున్నారు.
ఆ తరువాత అష్టమి, నవమి 15, 16 తేదీల్లో రానుండటంతో మంచిది కాదంటున్నారు. ఆపై 17వ తేదీ దశమి మంచిదే అయినప్పటికీ, శనివారం కావడంతో నామినేషన్ దాఖలుకు అభ్యర్థులు జంకుతున్నారు. ఇక 18వ తేదీ ఆదివారం సెలవు కారణంగా నామినేషన్ల స్వీకరణ ఉండదు. చివరి రోజైన సోమవారం 19వ తేదీ ఉదయం 11.38 గంటల వరకూ ఏకాదశి తిథి ఉంది. ఆపై ద్వాదశి. దీంతో ఉదయం నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు పోటెత్తవచ్చని అంచనా.