ayodhya: అయోధ్య విషయంలో మరో కీలక నిర్ణయం దిశగా యోగి ప్రభుత్వం!
- ఇటీవలే అయోధ్యగా పేరు మార్చుకున్న ఫైజాబాద్ జిల్లా
- జిల్లా వ్యాప్తంగా మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం దిశగా యూపీ సర్కార్
- సాధువుల డిమాండ్ మేరకు నిషేధం విధించనున్న ప్రభుత్వం
రామ జన్మభూమి అయోధ్య ఉన్న ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చి కొన్ని రోజులు కూడా కాకుండానే.... యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అయోధ్య జిల్లా వ్యాప్తంగా మద్యం, మాంసం అమ్మకాలను నిషేధించేందుకు సిద్ధమవుతోంది. అయోధ్యలో ఉన్న సాధువుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకోబోతోంది.
యూపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ, అయోధ్యలో ఉన్న సాధువుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. చట్టాలకు లోబడే అయోధ్య జిల్లాలో మద్యం, మాంసం విక్రయాలను నిషేధిస్తామని తెలిపారు.
అయోధ్య మందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ, శతాబ్దాలుగా అయోధ్య అత్యంత పవిత్రమైన స్థలమని... ఇక్కడ మద్యం, మాంసం అమ్మడం సరైంది కాదని చెప్పారు. వీటిని నిషేధించడం వల్ల ప్రజల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని అన్నారు. అయోధ్య పేరును ఇప్పుడు జిల్లాకు కూడా పెట్టారని... దీంతో, జిల్లా వ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేయాలని చెప్పారు. దీనివల్ల అశుద్ధి, కలుషితాలు ఆగిపోతాయని... శుద్ధిగా ఉన్నామనే భావన ప్రజల్లో వస్తుందని తెలిపారు.