Vizag: జగన్ పై దాడి కేసులో వైకాపా ఉద్యోగి విచారణ.. అతని ప్రమేయం లేదన్న పోలీసులు
- విశాఖ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగి ప్రమేయం లేదు
- రెండు రోజుల విచారణ తరువాత తేల్చిన సిట్
- క్యాంటీన్ యువతితో మాట్లాడినందునే విచారణన్న సిట్
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో వైకాపా విశాఖ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగి ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. అతన్ని స్టేషన్ కు పిలిపించి విచారించిన పోలీసులు, కేసుతో అతనికి సంబంధం లేదని వెల్లడించారు. శ్రీనివాసరావు కాల్ డేటా లో అతని నంబర్ లేదని, అయితే, క్యాంటీన్ లో పనిచేస్తున్న ఒక యువతి సెల్ ఫోన్ నుంచి అతనికి ఫోన్ వెళ్లడంతోనే పిలిచామని తెలిపారు.
శ్రీనివాసరావుకు అతన్ని చూపించి, ఎవరని అడుగగా, 'నాకు తెలియదు' అని సమాధానం ఇచ్చాడని పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో రెండు రోజుల విచారణ అనంతరం అతన్ని పంపించి వేసినట్టు అధికారులు చెప్పారు. కాగా, జగన్ పై దాడి కేసులో ఆఫీసు ఉద్యోగి ప్రమేయం లేనప్పటికీ, పోలీసులు వైకాపా ఉద్యోగిని విచారణకు పిలిపించడం, అతను ఓ ప్రముఖ నేత సిఫార్సు చేసిన వ్యక్తి కావడంతో ఈ వ్యవహారం ఆసక్తిని కలిగించింది.