Rafale: రాఫెల్ డీల్‌లో సంచలన విషయాలను బయటపెట్టిన ‘బిజినెస్ స్టాండర్డ్’.. మోదీ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందన్న పత్రిక
- 40 శాతం ధర పెంచేసి దోపిడీకి పాల్పడ్డారు
- నాలుగేళ్లలో ఒక్కో విమానం ధరను రూ.500 కోట్లకు పెంచారు
- మోదీ ప్రకటనకు పది రోజుల ముందే ఆవిర్భవించిన రిలయన్స్ డిఫెన్స్
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు నిజమేనని ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. పలు కీలక పత్రాలను సేకరించి విశ్లేషించిన అనంతరం ఈ కథనాన్ని ప్రచురించింది. ‘డీల్’ విషయంలో ‘దోపిడీ’ నిజమేనని పేర్కొంది. ఏకంగా 40 శాతం ధరను పెంచేసి దోపిడీకి పాల్పడ్డారని వివరించింది.
బిజినెస్ స్టాండర్డ్’ కథనం ప్రకారం.. రాఫెల్ డీల్ విషయంలో మోదీ ప్రభుత్వం చెబుతున్నవి పచ్చి అబద్ధాలని తేల్చింది. 2012లో జరిగిన ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్‌కు చెందిన దసో సంస్థ ఒక్కో యుద్ధ విమానాన్ని వెయ్యికోట్ల రూపాయలకు (15.5 కోట్ల యూరోలు) భారత్‌కు అందించేందుకు ముందుకొచ్చింది. అందులో భాగంగా 18 విమానాలను ‘రెడీ టు ఫ్లై’ దశలో భారత్‌కు అప్పగిస్తారు. ఒప్పందంలో భాగంగా మరో 108 విమానాలను బెంగళూరులోని హెచ్ఏఎల్లో తయారు చేస్తారు. ఇదే అసలు డీల్ అని పత్రిక వివరించింది.
మోదీ అధికారంలోకి వచ్చాక ఒకేసారి 36 విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 2016లో 7800 కోట్ల యూరోలు చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఒక్కో విమానం విలువ ఈ నాలుగేళ్లలో 15.5 కోట్ల యూరోల నుంచి 21.7 కోట్ల యూరోలు.. అంటే రూ. 1000 కోట్ల నుంచి రూ.1600 కోట్లకు పెరిగిపోయిందన్నమాట. ఈ లెక్కన చూసుకుంటే మోదీ ప్రభుత్వం ఈ డీల్ కోసం అదనంగా 40 శాతం ధరను చెల్లిస్తున్నట్టు పత్రిక పేర్కొంది.
రాఫెల్ డీల్ విషయంలో కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని, తాము కుదుర్చుకున్న డీల్‌లో 9 నుంచి 20 శాతం ధర తగ్గుతోందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పాత ఒప్పందంలో ఆయుధాలు, విడిభాగాలు, నిర్వహణ గ్యారెంటీ వంటివి లేవన్న మంత్రుల మాటలు పచ్చి అబద్ధాలని పత్రిక తేల్చి చెప్పింది. అంతేకాదు, హెచ్ఏఎల్లో తయారు కావాల్సిన విమానాలను ‘రిలయన్స్ డిఫెన్స్’కు మార్చిందని వివరించింది. రాఫెల్ ‘డీల్’పై ప్రధాని మోదీ ప్రకటన చేయడానికి సరిగ్గా పది రోజుల ముందు రిలయన్స్ డిఫెన్స్ పురుడు పోసుకుందని ‘బిజినెస్ స్టాండర్డ్’ పేర్కొంది.