Andhra Pradesh: శ్రీనివాసరావు కుటుంబం టీడీపీనే.. గతంలో వీళ్లు కృష్ణా డెల్టా పనులను అడ్డుకున్నారు!: మాజీ ఎంపీ హర్షకుమార్
- ఓ జేసీబీని గతంలో స్వాధీనం చేసుకున్నారు
- సబ్ కాంట్రాక్టరు నా దగ్గరకు వచ్చి వాపోయాడు
- శ్రీనివాసరావును రెస్టారెంట్ లో ఎవరు చేర్చారో తెలియాలి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడికి పాల్పడ్డ శ్రీనివాసరావు, అతని కుటుంబ సభ్యులు టీడీపీకి చెందినవారేనని అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తెలిపారు. గతంలో ఈ కుటుంబం తమ ప్రాంతంలో జరుగుతున్న కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులను అడ్డుకుందని వెల్లడించారు. అమలాపురంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కంటే ఆయన సోదరుడు పవర్ ఫుల్ అని పేర్కొన్నారు. ఆయన ప్రోద్బలంతోనే శ్రీనివాసరావు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో పనికి కుదిరాడన్నారు
గతంలో తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం మండలంలో కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనుల సందర్భంగా శ్రీనివాసరావు కుటుంబీకులు ఓ జేసీబీని స్వాధీనం చేసుకున్నారని హర్షకుమార్ గుర్తుచేసుకున్నారు. దీంతో అటుగా వెళుతున్న తనవద్దకు సబ్ కాంట్రాక్టర్ పరుగెత్తుకుంటూ వచ్చాడన్నారు. ‘సార్.. పనుల సందర్భంగా పొరపాటున జేసీబీ తగిలి వాళ్ల కొబ్బరి చెట్లు కూలిపోయాయి. దీంతో వాళ్లు మా జేసీబీని అడ్డుకున్నారు. మీరు కొంచెం మాట్లాడండి’ అని కోరాడన్నారు.
దీంతో కావాలంటే నష్టపరిహారం తీసుకోవాలనీ, అంతేకానీ ఇలా చేయడం భావ్యం కాదని శ్రీనివాసరావు కుటుంబీకులకు నచ్చజెప్పానన్నారు. ఈ సందర్భంగా తనతో ఉన్న స్థానిక నేతలు..‘వీళ్లంతా తెలుగుదేశం వర్గీయులు సార్.. వీరికి ఈ పనులు చేయడం ఇష్టం లేదు. అందుకే ఇలా అడ్డుపడుతున్నారు’ అని చెప్పారని పేర్కొన్నారు.
విశాఖ ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ రెస్టారెంట్ లో చేరేంత పరిచయాలు శ్రీనివాసరావుకు లేవని హర్షకుమార్ స్పష్టం చేశారు. అలాగే ఎయిర్ పోర్టులోకి వచ్చేందుకు నిందితుడికి అక్టోబర్ నెల వరకే అనుమతి ఉందని వార్తలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇదంతా గమనిస్తుంటే ఏదో కుట్ర కోణం ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు.