Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచన!
- ఆదిలాబాద్ లో 9 డిగ్రీలు నమోదు
- విశాఖ ఏజెన్సీలో దిగజారుతున్న ఉష్ణోగ్రతలు
- హైదరాబాద్ లో ఈ సీజన్ లోనే అత్యల్ప ఉష్ణోగ్రత
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్ లో నిన్న రాత్రి ఉష్ణోగ్రత కనిష్టంగా 14.8 డిగ్రీలకు పడిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్ లో నమోదయిన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని వెల్లడించింది. ఇక ఆదిలాబాద్ లో 9 డిగ్రీలు, రామగుండంలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని పేర్కొంది.
అలాగే విశాఖ ఏజెన్సీలోనూ ప్రజలను చలిపులి భయపెడుతోంది. తాజాగా జి.మాడుగుల, జీకే వీధి, లంబసింగిలో ఉష్ణోగ్రతలు ఏకంగా 7 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో పాటు చింతపల్లిలో 9 డిగ్రీలు, మినుములూరులో 10 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.