Ponnala: తొలి జాబితాలో పేరు హుళక్కే... సీటు పొందని కాంగ్రెస్ ప్రముఖులు వీరే!
- పొన్నాల, విజయశాంతిలకు దక్కని స్థానం
- మర్రి శశిధర్, పీజేఆర్ కుమారుడు విష్ణు పేర్లు లేవు
- పెండింగ్ లో పలు స్థానాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడే 65 మంది పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి విదితమే. అయితే, ఆ జాబితాలో పలువురు ప్రముఖులకు చోటు దక్కలేదు. వీరిలో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, నటి విజయశాంతి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిలు ఉన్నారు. వీరితో పాటు పీజేఆర్ కుమారుడు, జూబ్లీహిల్స్ టికెట్ ను ఆశిస్తున్న విష్ణువర్థన్ రెడ్డి పేరు కూడా లేదు.
వీరితో పాటు మరో 15 స్థానాల్లో ముగ్గురు, అంతకన్నా ఎక్కువ మంది పోటీ పడుతూ ఉండటంతో ఆ జాబితాను కూడా కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టింది. టీజేఎస్, సీపీఐతో పొత్తులో భాగంగా ఎవరు పోటీ చేయాలన్న విషయం ఇంకా తేలని సీట్ల విషయంలోనూ కాంగ్రెస్ వేచి చూసే ధోరణిని పాటించింది. మొత్తం మీద తొలి జాబితాలో కాంగ్రెస్ అధిష్ఠానం తనదైన మార్క్ ను చూపించిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.