jagan: జగన్మోహన్ రెడ్డీ.. ఇదేనా కడప పౌరుషం?: తులసిరెడ్డి
- పాదయాత్ర వల్ల ఏపీకి రాగి దమ్మిడి అంత ప్రయోజనం కూడా లేదు
- బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు.. మోదీకి భయపడుతున్నారు
- ముద్దులు, సెల్ఫీలు, సొంత మీడియాలో డబ్బా కొట్టుకోవడం.. ఇదే పాదయాత్ర
వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర వల్ల ఏపీకి రాగి దమ్మిడి అంత ప్రయోజనం కూడా లేదని ఆయన విమర్శించారు. సీమాంధ్ర స్వర్ణాంధ్ర కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఎన్నో రావాల్సి ఉందని... వీటిపై పార్లమెంటు, అసెంబ్లీ లోపలా, బయటా పోరాటం చేయాలని... అయితే, పార్లమెంటుకు రాజీనామాలు చేయడం, అసెంబ్లీని బహిష్కరించడం ద్వారా పోరాడే అవకాశాన్ని వైసీపీ కోల్పోయిందని అన్నారు.
పాదయాత్రలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించడం లేదని... బీజేపీని పల్లెత్తు మాట కూడా అనడం లేదని తులసిరెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీకి భయపడుతున్నారని అన్నారు. కడప పౌరుషానికి, ఢిల్లీ మధ్య పోటీ అని గతంలో జగన్ చెప్పారని... ఇదేనా కడప పౌరుషం? అని ఆయన ఎద్దేవా చేశారు. రోజుకు 10 కిలోమీటర్లు నడవడం, ముద్దులు పెట్టడం, సెల్ఫీలు తీసుకోవడం, సొంత టీవీ, పత్రికలో డబ్బాలు కొట్టుకోవడం... ఇదే పాదయాత్ర దినచర్య అని అన్నారు.
జగన్ పాదయాత్ర కోసం రోజుకు రూ. 2 కోట్లు ఖర్చు అవుతోందని చెప్పారు. ఈ మాత్రం దానికి పాదయాత్ర అవసరమా? అని ప్రశ్నించారు. వీలైనంత త్వరగా పాదయాత్రను ముగించుకోవాలని... వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఆర్థిక భారం వేయడాన్ని ఆపేయాలని సూచించారు. పాదయాత్రను ఆపేసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర సమస్యల మీద పోరాటం చేస్తే మంచిదని హితవు పలికారు.