Andhra Pradesh: విశాఖ భూ కుంభకోణంలో 400 మంది నేతలు, అధికారులు.. బాంబు పేల్చిన మంత్రి అయ్యన్న పాత్రుడు!
- నేతలు రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు
- వారి పేర్లను బయటపెట్టేందుకు భయపడుతున్నారు
- 20 రోజుల్లోగా దోషులపై చర్యలు తీసుకుంటాం
ఆంధ్రప్రదేశ్ లో భూకబ్జా దారులు భయపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు. ప్రభుత్వం కూడా కబ్జా దారులపై ఉక్కుపాదం మోపాలని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో భూ ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) 3-4 నెలల పాటు లోతుగా విచారణ జరిపిందన్నారు. కృష్ణా జిల్లాలోని పోరంకిలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడారు.
సిట్ అధికారులు విచారణను నిజాయతీగా పూర్తిచేశారనీ, ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని మంత్రి తెలిపారు. విశాఖ భూ కుంభకోణంలో దాదాపు 400 మంది ప్రజా ప్రతినిధులు, అధికారుల పేర్లు నివేదికలో ఉన్నాయని బాంబు పేల్చారు. ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేయడం కారణంగా తాము లొంగాల్సి వచ్చిందని రెవెన్యూ ఉద్యోగులు సిట్ ముందు వాపోయారని పేర్కొన్నారు.
అయితే ఆ ఒత్తిడి తెచ్చిన పెద్దలు ఎవరో చెప్పేందుకు మాత్రం అధికారులు జంకుతున్నారని వ్యాఖ్యానించారు. దోషులపై మరో 10-20 రోజుల్లోగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఫైళ్లపై సంతకం ఎందుకు చేశారు? భూ రికార్డులను ఎందుకు తారుమారు చేశారు? ఈ పనులు చేయాలని ఎవరు ఒత్తిడి చేశారో ధైర్యంగా బయటపెట్టాలని ఉద్యోగులకు సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందన్నారు. విశాఖపట్నంలో దాదాపు రూ.20,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రికార్డులు తారుమారు చేసి కొందరు నేతలు కాజేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.