Andhra Pradesh: జగన్ పై హత్యాయత్నం కేసు.. పలువురికి నోటీసులు జారీచేసిన హైకోర్టు!
- కేంద్ర, ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులకు నోటీసులు
- రెండు వారాల్లోగా స్పందించాలని ఆదేశం
- ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టును ఆశ్రయించిన జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ హత్యాయత్నం ఘటనపై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తనపై దాడి జరిగిందని జగన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని పిటిషన్ లో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఈ హత్యాయత్నంపై విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో నేడు జగన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ డీజీపీ, విశాఖ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, పోలీస్ స్టేషన్ (పట్టణ ఐదవ) హౌస్ ఆఫీసర్ లతో పాటు కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర డీజీపీలకు నోటీసులు జారీచేసింది.
రెండు వారాల్లోగా ఈ విషయమై తమ ప్రతిస్పందనను తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే పోలీసులు జరిపిన విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో సమర్పించాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. అక్టోబర్ 25న హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ జగన్ హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని, విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆయన నిన్న ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు.