Telangana: తెలంగాణ ప్రభుత్వానికి షాక్.. ధర్నా చౌక్ ను పునరుద్ధరిస్తూ హైకోర్టు ఆదేశాలు!
- మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన కోర్టు
- ఆరు వారాల పాటు అమల్లో ఉంటుందని వెల్లడి
- తెలంగాణ ప్రభుత్వం, పోలీసులకు నోటీసులు
ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ ఎత్తివేత నిర్ణయాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆరు వారాల పాటు ఈ తీర్పు అమల్లో ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. నగరం మధ్యలో ధర్నా చౌక్ ఉండటంతో తమకు ఇబ్బంది కలుగుతోందనీ, పిల్లలను పాఠశాలలకు పంపలేకపోతున్నామని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ధర్నాచౌక్ ను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రాంతంలో ఆందోళనలపై పోలీసులు నిషేధాన్ని విధించారు. నగరానికి దూరంగా ఉన్నచోట ఆందోళనలు నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో పలు ప్రజాసంఘాలు, పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అప్పటి అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ప్రజల భద్రత కోసమే ధర్నా చౌక్ ను ఎత్తివేశామని తెలిపారు. ధర్నా చౌక్ కారణంగా స్థానికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందనీ, ట్రాఫిక్ భారీగా స్తంభిస్తోందని వాదించారు. అయితే ఈ వాదనలను పిటిషనర్లు ఖండించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. తాజాగా నేడు మరోసారి పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ధర్నాచౌక్ ను పునరుద్ధరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆదేశాలు ఆరువారాల పాటు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. ఈ విషయంలో తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీసులకు నోటీసులు జారీచేసింది.