KCR: రేపు నామినేషన్ దాఖలు చేస్తే కేసీఆర్‌కు రాజయోగం సిద్ధిస్తుందట!
- వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్న కేసీఆర్
- 11 గంటల నుంచి ఒంటి గంట వరకు మకర లగ్నం
- 1.30 నుంచి 2.50 గంటల వరకు కుంభలగ్నం
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్స్‌కు ఎంత ప్రాధాన్యమిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలో నామినేషన్ల ఘట్టం రానే వచ్చింది. రేపు కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆయన ఒక సెంటిమెంట్‌ను అనుసరిస్తూ వస్తున్నారు. 1985 నుంచి నామినేషన్ వేసేందుకు వెళ్లిన ప్రతీసారి ఆయన సిద్ధిపేట నంగునూర్ మండలంలోని కూనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని నామినేషన్ పత్రాలు స్వామివారి పాదాల వద్ద ఉంచి.. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం నామినేషన్ దాఖలు చేస్తూ వస్తున్నారు.
రేపు కూడా ఆయన హెలికాప్టర్లో కోనాయిపల్లికి వెళ్లి.. పూజలు చేసి.. అక్కడి నుంచి గజ్వేల్‌కు వెళ్తారు. అక్కడ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. అయితే రేపటి ముహూర్తానికి ఓ ప్రత్యేకత ఉంది. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు మకర లగ్నం. మధ్యాహ్నం 1.30 నుంచి 2.50 గంటల వరకు కుంభలగ్నం. ఈ రెండు ముహూర్తాల్లో నామినేషన్ వేస్తే మరోసారి రాజయోగం సిద్ధిస్తుందని కేసీఆర్‌కు పండితులు సూచించారు. దీంతో ఆయన రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.