warangal west: ఏ సర్వే ప్రాతిపదికన వరంగల్ వెస్ట్ ను టీడీపీకి ఇచ్చారు?: నాయిని రాజేందర్ రెడ్డి
- పార్టీని నమ్ముకున్న కార్యకర్తల గొంతు కోయొద్దు
- బ్లాక్ మెయిల్ రాజకీయాల వల్లే నాకు టికెట్ రాలేదు
- నా కంటే మెరుగైన అభ్యర్థి ఎవరైనా ఉన్నారా?
ఏ సర్వే ప్రాతిపదికన వరంగల్ వెస్ట్ ను టీడీపీకి ఇచ్చారని ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నాయకుడు నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీని నమ్ముకున్న కార్యకర్తల గొంతు కోయొద్దని, బ్లాక్ మెయిల్ రాజకీయాల వల్లనే తనకు టికెట్ రాలేదని ఆరోపించారు. టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి కోసం తనను బలి చేశారని వాపోయారు.
వరంగల్ వెస్ట్ నుంచి టీడీపీ ఎన్నడూ గెలవలేదని, ఈ నియోజకవర్గం నుంచి తన కంటే మెరుగైన అభ్యర్థి ఉంటే వారికి టికెట్ ఇస్తే తనకేమీ అభ్యంతరం లేదని చెప్పిన నాయిని, పక్క సెగ్మెంట్ నుంచి వచ్చిన రేవూరికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పొత్తులంటే తనకు గౌరవం ఉందని, అలా అని చెప్పి ప్రతిసారీ తామే త్యాగం చేయాలా? ఒక్కో ఇంట్లో ఇద్దరు చొప్పున టికెట్లు తీసుకుంటున్నావారు త్యాగం చేయకూడదా? అని ప్రశ్నించారు. 'మేజర్ సిటీల్లో టీడీపీకి అవకాశం ఇవ్వడమేంటి? మా పార్టీలో కొందరు బ్రోకర్లు ఉన్నారు. ఎలక్షన్లు వస్తే వారికి కలెక్షన్లే' అని విమర్శించారు. భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో చర్చిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ శక్తి యాప్ లు, మెంబర్ షిప్ లు, సర్వేలు ఎక్కడికిపోయాయి? అని మండిపడ్డారు.
రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపైనే నామినేషన్ వేస్తానని చెప్పిన నాయిని, తనకు తప్పకుండా టికెట్ వస్తుందని చెప్పడం గమనార్హం. తప్పు ఎక్కడ జరిగిందో కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తోందని, కొత్త వాళ్లు రావడంతో పాతవాళ్లను మర్చిపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. నిన్నటి దాకా పార్టీనే తన అధిష్ఠానం అని, నేటి నుంచి ప్రజలే తన అధిష్ఠానమని ఆయన చెప్పుకొచ్చారు.