Cold wave: తెలంగాణలో వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- రాష్ట్ర వ్యాప్తంగా శీతల గాలులు
- మున్ముందు మరింత చలి
- వాతావరణశాఖ హెచ్చరిక
కార్తీకమాసం ప్రారంభం అయిందో, లేదో.. తెలంగాణలో చలి విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా సాధారణ స్థాయిలోనే ఉన్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతుండడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. దీనికి తోడు శీతల గాలులు మరింత ఇబ్బంది పెడుతున్నాయి.
ఆదిలాబాద్లో మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీలుగా నమోదైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాండూరులో 8.2 డిగ్రీలు, హైదరాబాద్లో 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దలు అప్పుడే చలిమంటలను ఆశ్రయిస్తున్నారు.