AIADMK: అన్నాడీఎంకేకు కొత్త టీవీ చానల్... ‘న్యూస్ జె’ పేరుతో ప్రేక్షకుల ముందుకు!
- నేటి సాయంత్రం ప్రారంభం
- ఇప్పటి వరకు ఉన్న టీవీ, పేపర్ శశికళ చేతుల్లోకి
- ఫిబ్రవరిలోనే ప్రారంభమైన ‘నమదు జయ’ పత్రిక
రాజకీయ పార్టీలకు ప్రత్యేకంగా టీవీ చానల్ ఉండడం కొత్తకాదు. ప్రత్యేకంగా ఓ పార్టీ కోసం పనిచేసే వార్తా చానళ్లు దేశంలోనే అనేకం ఉన్నాయి. తాజాగా, తమిళనాడులోని అన్నాడీఎంకే కోసం కూడా ఓ కొత్త చానల్ వచ్చేసింది. ‘న్యూస్ జె’ పేరుతో బుధవారం సాయంత్రం అభిమానుల ముందుకు రానుంది. తమిళ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి దీనిని ప్రారంభించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందే వరకు ‘జయ టీవీ’, ‘నమదు ఎంజీఆర్’ దినపత్రిక పార్టీ కోసం పనిచేసేవి. అయితే, ఇవి శశికళ కుటుంబానికి చెందినవి కావడంతో జయ మరణం తర్వాత అవి వారి నియంత్రణలోకి వెళ్లిపోయాయి.
అనంతరం జరిగిన పరిణామాలతో పళని, పన్నీర్ వర్గం, శశికళ వర్గం మధ్య విభేదాలు రావడంతో అన్నాడీఎంకేకు అండగా నిలిచే చానల్ కరవైంది. ప్రభుత్వ పాలనకు సంబంధించిన వార్తలకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో ప్రత్యేకంగా పేపర్, టీవీ చానల్ ప్రారంభించాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జయలలిత జయంతి సందర్భంగా ‘నమదు అమ్మ’ పత్రికను ప్రారంభించారు. ఇప్పుడు టీవీ చానల్ ‘న్యూస్ జె’ను తీసుకొస్తున్నారు. సెప్టెంబరులోనే చానల్ లోగోను పళని స్వామి, పన్నీర్ సెల్వం కలిసి ఆవిష్కరించారు. నేటి సాయంత్రం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చానల్‌ను ప్రారంభించనున్నారు.