Narendra Modi: ఫిన్‌టెక్, స్టార్టప్ కంపెనీలకు భారత్ గమ్యస్థానం: ప్రధాని మోదీ
- సింగపూర్‌లో బుధవారం జరిగిన ఫిన్‌టెక్-2018 సదస్సులో కీలకోపన్యాసం
- ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెకీల దృష్టి భారత్‌పైనే
- ఆర్థిక సమ్మిళిత శక్తిగా భారత్ పురోగమనం అని స్పష్టీకరణ
భారతదేశం ఆర్థిక సమ్మిళిత శక్తిగా పురోగమన పథంలో దూసుకు పోతోందని, ఫిన్‌టెక్, స్టార్టప్ కంపెనీలకు భారత్ గమ్యస్థానంగా మారిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెకీల దృష్టి భారత్‌పై ఉందని చెప్పారు. ఐటీ సేవల నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ దిశగా దూసుకువెళ్తున్నామని చెప్పారు.
సింగపూర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ నేడు అక్కడ జరిగిన ఫిన్‌టెక్-2018 సదస్సులో కీలకోపన్యాసం చేశారు. ఈ సదస్సుకు వంద దేశాల నుంచి దాదాపు 30 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. స్వల్పకాలంలోనే సాంకేతికతను అందిపుచ్చుకున్న ఘనత భారత్‌కు దక్కుతుందని చెప్పారు.
వందకోట్లకు పైగా సెల్ ఫోన్ల వినియోగంతో భారత్ ప్రపంచంలోనే ముందుందన్నారు. 2014కు ముందు భారత్ జనాభాలో సగం మంది కంటే తక్కువ మందికి బ్యాంకు ఖాతాలుండగా, ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరికీ ఖాతా ఉందన్నారు. మౌలిక వసతుల కల్పనలో ముందున్నామని తెలిపారు.